Jagan: ఈ నెల 19 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు... హాజరుకానున్న సీఎం జగన్
- రెండ్రోజుల పాటు తిరుమలలో సీఎం జగన్
- బ్రహ్మోత్సవాలకు వస్తున్న కర్ణాటక సీఎం యడియూరప్ప
- గరుడ సేవ నాడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
తిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈసారి బ్రహ్మోత్సవాలకు భక్తులను అనుమతించడంలేదు. దాంతో ఈ వేడుకను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ తో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కూడా హాజరవుతున్నారు.
సీఎం జగన్ ఈ నెల 23న సాయంత్రం తిరుమల చేరుకుంటారు. ఆ రోజున జరిగే గరుడ సేవను పురస్కరించుకుని సీఎం జగన్ తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకోనున్నారు.
దర్శనం తర్వాత నాదనీరాజనం మంటపంలో నిర్వహించే సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా వస్తారని తెలుస్తోంది. అనంతరం, తిరుమలలో కర్ణాటక అతిథి గృహం శంకుస్థాపలో యడియూరప్పతో కలిసి సీఎం జగన్ కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం జగన్ పద్మావతి అతిథి గృహానికి చేరుకుని అల్పాహారం స్వీకరిస్తారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం తాడేపల్లి తిరుగు పయనమవుతారు.
కాగా ఈ ఏడాది రెండు పర్యాయాలు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. యథావిధిగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అధికమాసంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 19 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దసరా సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.