Jyothi Sri Durga: క్షమించండి... అలసిపోయాను!.. నీట్ పరీక్ష నేపథ్యంలో ఓ విద్యార్థిని బలవన్మరణం

Tamilnadu Girl commits suicide day before NEET examination

  • మధురైలో విషాద ఘటన
  • గతేడాది నీట్ లో విఫలమైన జ్యోతి శ్రీదుర్గ
  • ఈ ఏడాది కూడా విఫలమవుతానేమోనన్న ఆందోళనతో ఆత్మహత్య

నేటి విద్యావిధానంలో విద్యార్థులపై ఎంతో ఒత్తిడి ఉంటోందని నిపుణులు చెబుతుండడం తెలిసిందే. పోటీ ప్రపంచంలో వెనుకబడిపోతామేమో అన్న ఆందోళనతో అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా తమిళనాడులోని మధురై ప్రాంతానికి చెందిన జ్యోతి శ్రీదుర్గ అనే విద్యార్థిని నీట్ పరీక్ష నేపథ్యంలో తనువు చాలించింది. నీట్ పరీక్షకు ముందురోజు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర విషాదానికి గురిచేసింది.

19 ఏళ్ల జ్యోతి శ్రీదుర్గ తన కుటుంబ సభ్యులతో కలిసి మధురైలోని సాయుధ బలగాల క్వార్టర్స్ లో ఉంటోంది. ఆమె తండ్రి మురుగసుందరం ఐదో బెటాలియన్ లో పనిచేస్తున్నారు. జ్యోతి గతేడాది కూడా నీట్ పరీక్ష రాయగా 100 మార్కులు వచ్చాయి. ఈ ఏడాది నీట్ పరీక్ష కోసం ఆమె తీవ్రంగా కష్టపడింది. కానీ మరోసారి విఫలమైతే ఎలా అన్న ఆందోళనతో బలవన్మరణం చెందింది. తన గదిలోనే విగతజీవురాలుగా కనిపించింది.

సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. 'ఎంతో అలసిపోయాను, నన్ను క్షమించండి' అంటూ ఆ లేఖలో పేర్కొంది. తల్లిదండ్రుల అంచనాలను తాను అందుకోలేకపోతానేమో అని అనేక పర్యాయాలు ఆ లేఖలో ప్రస్తావించింది. తల్లిదండ్రుల ఆశయాన్ని సాధించలేనేమో అన్న ఆందోళనతో సతమతమవుతున్నానని జ్యోతి తన లేఖలో తెలిపింది.

అంతేకాదు, ఓ వీడియో సందేశం కూడా ఆమె తన మరణానికి ముందు రికార్డు చేసింది. తన చావుకు మీరు బాధ్యులు కారంటూ తల్లిదండ్రులను ఉద్దేశించి ఆ వీడియోలో వెల్లడించింది.

  • Loading...

More Telugu News