Thief: వైజాగ్ లో 'దిగంబర దొంగ' ఆటకట్టించిన పోలీసులు!

Vizag police arrested a thief who goes robberies without dress

  • నగ్నంగా దొంగతనాలకు వెళుతున్న వ్యక్తి
  • వైజాగ్ ప్రజల్లో భయాందోళనలు
  • దొంగను గుంటూరు జిల్లా వాసి మోహనరావుగా గుర్తింపు
  • మోహనరావుపై 60కి పైగా చోరీ కేసులు

విశాఖలో ఇటీవల కొన్నిరోజులుగా ఓ దొంగ ఒంటిపై నూలుపోగు లేకుండా వెళ్లి దొంగతనాలు చేస్తుండడం తీవ్ర కలకలం రేపింది. ఆ దొంగ దిగంబర అవతారం సీసీ కెమెరాలకు చిక్కడంతో పోలీసులు సైతం విస్తుపోయారు. నాలుగు ఇళ్లలో దొంగతనానికి ప్రయత్నించిన ఆ దొంగ చివరికి ఓ ఇంట్లో నగదు చోరీ చేశాడు. ఇలాంటి దొంగ గురించి గతంలో ఎన్నడూ వినని వైజాగ్ వాసులకు ఈ దిగంబర దొంగ తీవ్ర ఆందోళనకరంగా పరిణమించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు దీన్నో సవాల్ తీసుకుని రంగంలోకి దిగారు.

కొన్నిరోజుల్లోనే ఆ దిగంబర దొంగను పట్టుకున్నారు. అతడికి సహకరిస్తున్న సతీశ్ కుమార్ అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వైజాగ్ డీసీపీ ఐశ్వర్య రస్తోగి మీడియాకు వివరాలు తెలిపారు. ఆ దిగంబర దొంగ పేరు కంచర్ల మోహనరావు. అతడు గుంటూరు జిల్లాకు చెందినవాడు. ఇక, ఒంటిపై దుస్తులు లేకుండా చోరీలకు వెళ్లడానికి గల కారణాలను కూడా డీసీపీ వివరించారు.

దొంగతనం చేసే సమయంలో ప్రజలకు దొరికిపోతే వారు మతిస్థిమితం లేదనుకుని వదిలేస్తారని ఈ దిగంబర వేషం వేసేవాడని తెలిపారు. మోహనరావు చోరీలు చేస్తే, సతీశ్ కుమార్ చోరీ సొత్తును విక్రయించేవాడని వెల్లడించారు. మోహనరావుపై 60కి పైగా చోరీ కేసులు ఉన్నట్టు తెలిపారు. కాగా, మోహనరావును అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News