Amrapali: ఐఏఎస్ అమ్రపాలికి అరుదైన అవకాశం... ఇకపై ప్రధాని కార్యాలయంలో విధులు!
- 2010 ఏపీ క్యాడర్ కు చెందిన అధికారిణి
- తాజాగా పీఎంఓలో డిప్యూటీ కార్యదర్శిగా పోస్టింగ్
- 2023 వరకూ విధుల్లో కొనసాగనున్న అమ్రపాలి
గతంలో తెలంగాణలో ఐఏఎస్ అధికారిణిగా పలు ప్రాంతాల్లో సేవలందించి, ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారిణి కాటా అమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ఆమె తాజాగా ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రెటరీగా నియమితులయ్యారు.
ఈ పదవిలో ఆమె 2023, అక్టోబర్ వరకూ కొనసాగనున్నారు. అమ్రపాలితో పాటు డైరెక్టర్ గా రఘురాజ్ రాజేంద్రన్, అండర్ సెక్రటరీగా మంగేశ్ గిల్టియాల్ ను నియమిస్తూ, క్యాబినెట్ నియామకాల కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, 2010 ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన అమ్రపాలి గతంలో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా, వరంగల్ కలెక్టర్ గా, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిణిగా సేవలందించారు. ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియేట్ లో డిప్యూటీ కార్యదర్శి హోదాలో ఉన్నారు.