Prasadz: జీతం ఇవ్వడం లేదని హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ ఉద్యోగి ఆత్మహత్య!
- లాక్ డౌన్ నుంచి నిలిచిన సినిమా ప్రదర్శనలు
- ఇక వేతనం ఇవ్వలేమన్న యాజమాన్యం
- మనస్తాపంతో ఉరేసుకున్న భాస్కర్
లాక్ డౌన్ కారణంగా సినిమా ప్రదర్శనలు నిలిచిపోవడంతో, మరో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, ఇక్కడి ఐమాక్స్ థియేటర్ లో ఆపరేటర్ గా పనిచేస్తున్న భాస్కర్ (52) అనే వ్యక్తికి మార్చి నుంచి సగం వేతనమే లభించింది. ఇకపై ఆ మాత్రం జీతాలు కూడా ఇవ్వలేమని యాజమాన్యం స్పష్టం చేసింది.
దీంతో కుటుంబం ఎలా సాగుతుందోనన్న ఆందోళనలో పడిపోయిన భాస్కర్, తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన నివాసంలోనూ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.