Kala Venkatrao: సుప్రీంకోర్టు ఆదేశాలతో జగన్ సహా వైసీపీ నేతలకు భయం పట్టుకుంది: కళా వెంకట్రావు
- వైసీపీ నేరగాళ్ల అడ్డా అంటూ కళా వ్యాఖ్యలు
- జగన్ శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్లడంలేదన్న టీడీపీ నేత
- వైసీపీ నేతలపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయని వెల్లడి
టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. నేరగాళ్లకు వైసీపీ కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. ప్రజాప్రతినిధులపై కోర్టుల్లో ఉన్న కేసుల వివరాలు అందజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో జగన్ సహా వైసీపీ నేతలందరికీ భయం పట్టుకుందని అన్నారు. నేరగాళ్లకు అడ్డాగా మారిపోయిన వైసీపీలో 50 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయని, 9 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు, ఏడుగురు ఎంపీలపై అత్యాచారం కేసులు ఉన్నాయని వివరించారు.
సీఎం జగన్ పై ఉన్న కేసులు 8 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయని, సీఎం కుంటిసాకులతో విచారణకు హాజరవడంలేదని ఆరోపించారు. తమపై ఉన్న కేసులు విచారణ చేయాలని సుప్రీం కోర్టుకు జగన్, విజయసాయిరెడ్డి లేఖ రాయగలరా? అని ప్రశ్నించారు. లేఖ సంగతి తర్వాత... విజయసాయిరెడ్డి కనీసం ఒక్క ట్వీట్ చేయగలరా? అని నిలదీశారు. సీఎం జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా ఎందుకు విచారణ ఆలస్యం చేస్తున్నారని కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులపై వివిధ న్యాయస్థానాల్లో ఉన్న కేసుల వివరాలు సమర్పించాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కళా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం పదవుల్లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 4,442 మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన సుప్రీం కోర్టు అన్ని పెండింగ్ కేసుల వివరాలు తమకు అందించాలంటూ రాష్ట్ర హైకోర్టులను ఆదేశించింది.