Laungi Bhuiyan: బీహార్ లో మరో మాంఝీ... ఒక్కడే 30 ఏళ్ల పాటు శ్రమించి 3 కిమీ కాలువ తవ్వాడు!
- ఊరికోసం కాలువ తవ్విన సామాన్యుడు
- ఒక్కడే శ్రమించిన వైనం
- గ్రామస్తుల హర్షం
బీహార్ కు చెందిన దశరథ్ మాంఝీ అనే వ్యక్తి 22 ఏళ్లు కష్టపడి ఒక్కడే ఒక కొండను తొలచి గ్రామానికి రహదారి నిర్మించడం గతంలో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మాంఝీ కథతో సినిమా కూడా తెరకెక్కింది. సరిగ్గా ఇప్పుడలాంటి బృహత్తర ప్రయత్నంతో బీహార్ కు చెందిన మరో వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఆయన పేరు లంగీ భుయాన్. బీహార్ లోని గయ ప్రాంతంలోని కోటీలావ గ్రామ నివాసి. వర్షాకాలంలో ఆ ఊరి సమీపంలో ఉన్న కొండలపై కురిసిన వర్షం వృథాగా నదుల్లో కలవడం గమనించిన లంగీ భుయాన్ ఓ ఘనతర కార్యాన్ని చేపట్టాడు. 30 ఏళ్ల కిందట కొండల కింద నుంచి కాలువ తవ్వడం మొదలుపెట్టి ఇన్నాళ్లకు పూర్తి చేశాడు. 3 కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వాడు.
ఇప్పుడా కాలువ నుంచి ప్రవహించే నీరు ఓ కుంటలోకి చేరి అక్కడి నుంచి పంట పొలాలకు వెళుతోంది. గ్రామస్తులు లంగీ భుయాన్ భగీరథ ప్రయత్నం సఫలం కావడం చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భుయాన్ మాట్లాడుతూ, ఎంతోమంది ఉపాధి కోసం పట్టణాలకు వెళుతున్నారని, తాను మాత్రం గ్రామాన్ని నమ్ముకుని జీవిస్తున్నానని, ఈ 30 ఏళ్లలో కాలువ తవ్వుతుంటే తనకు సాయం చేసినవాళ్లే లేరని తెలిపారు.
భుయాన్ నిత్యం పశువులను మేతకు తోలుకుని వెళ్లేవాడు. పశువులే మేసే సమయంలో భుయాన్ కాలువ తవ్వకం పనులు చేపట్టేవాడు.