Kerala: శ్రీశాంత్‌కు ఇక పూర్తి స్వేచ్ఛ.. నిన్నటితో ముగిసిన ఏడేళ్ల నిషేధం!
- స్పాట్ ఫిక్సింగ్ కేసులో జీవితకాల నిషేధానికి గురైన శ్రీశాంత్
- సుప్రీంకోర్టు జోక్యంతో ఏడేళ్లకు తగ్గిన నిషేధం
- కేరళ తరపున క్రికెట్ ఆడతానన్న సీనియర్ బౌలర్
టీమిండియా సీనియర్ బౌలర్, కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్‌కు ఇప్పుడిక స్వేచ్ఛ లభించినట్టే. ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్‌పై బీసీసీఐ ఏడేళ్ల నిషేధం విధించింది. నిన్నటితో ఆ నిషేధం పూర్తయింది.
2013 సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కున్న శ్రీశాంత్‌తోపాటు మరో ఇద్దరిపై అదే ఏడాది ఆగస్టులో బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. బోర్డు తనపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ శ్రీశాంత్ ఏళ్లతరబడి న్యాయపోరాటం చేశాడు. దీంతో అతడిపై విధించిన శిక్షాకాలాన్ని తగ్గించాలంటూ గతేడాది బీసీసీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదించింది. అది నిన్నటితో ముగియడంతో శ్రీశాంత్‌కు పూర్తి విముక్తి లభించినట్టు అయింది.
నిషేధం ముగియడంతో పట్టలేనంత ఆనందంలో ఉన్నానని శ్రీశాంత్ తెలిపాడు. ఈ రోజు కోసం తానెంతో కాలంగా ఎదురుచూశానన్నాడు. ఇది తనకెంతో ప్రత్యేకమైన రోజన్న శ్రీశాంత్.. ఇకపై దేశవాళీ క్రికెట్‌లో కేరళ తరపున ఆడాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టాడు. కరోనా మహమ్మారి కారణంగా దేశవాళీ పోటీలు జరగకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశాడు.
మే నెల నుంచే తాను ప్రాక్టీస్ చేస్తున్నానని, తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ను మళ్లీ ఆడాలని ఉందని పేర్కొన్నాడు. కరోనా కారణంగా దేశవాళీ పోటీలు జరగకపోవడం బాధగా ఉందని, నిరుత్సాహంతో క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని కూడా అనుకున్నానని శ్రీశాంత్ పేర్కొన్నాడు. అయితే, రిటైర్మెంట్ ప్రకటిస్తే తను క్రికెట్ తిరిగి ఆడేందుకు తాను చేసిన నిరీక్షణ వృథా అవుతుందన్న ఉద్దేశంతో మనసు మార్చుకున్నానని శ్రీశాంత్ తెలిపాడు.