Narendra Modi: భారత ప్రధాని మోదీ నాకు ఫోన్ చేసి ప్రశంసించారు: ట్రంప్
- అమెరికాలో వేడిని పెంచుతున్న ఎన్నికల ప్రచారం
- కరోనాను కంట్రోల్ చేయడంలో ట్రంప్ విఫలమయ్యారని బైడెన్ విమర్శలు
- తాము చేసినదాన్ని మోదీ మెచ్చుకున్నారన్న ట్రంప్
అమెరికాలో ఎన్నికల వేడి పెరిగింది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఆయన పోటీదారుడు జో బైడెన్ (డెమోక్రాట్ అభ్యర్థి)ల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని బైడెన్ విమర్శించారు. ఈ విమర్శలపై ట్రంప్ స్పందిస్తూ, కరోనాను ఎదుర్కొనే క్రమంలో తాను చేసిన పనిని భారత ప్రధాని మోదీ ప్రశంసించారని చెప్పారు. కరోనా టెస్టింగుల విషయంలో తాను గొప్పగా వ్యవహరించానని మోదీ కితాబునిచ్చారని అన్నారు.
ఇండియా కంటే ఎక్కువ కరోనా టెస్టులు తాము చేశామని... కొన్ని పెద్ద దేశాలన్నీ కలిసి చేసిన టెస్టుల కంటే తాము ఎక్కువగా చేశామని ట్రంప్ చెప్పారు. ఇండియా కంటే 44 మిలియన్ల టెస్టులను అధికంగా చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసి ప్రశంసించారని చెప్పారు. ఇదే విషయాన్ని నిజాయతీ లేని తమ దేశ మీడియాకు చెప్పాలని మోదీని తాను కోరానని ట్రంప్ అన్నారు.
చైనా వైరస్ (కరోనా) అమెరికాలోకి ప్రవేశించే సమయంలో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉన్నట్టైతే... అదనంగా మరి కొన్ని వేల మంది అమెరికన్లు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయేవారని ట్రంప్ అన్నారు. అత్యంత బలహీనమైన ప్రభుత్వంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారని... వారి హయాంలో అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు.