Nara Lokesh: కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చేనేత రంగాన్ని కాపాడాలంటూ మంత్రి గౌతమ్ రెడ్డికి నారా లోకేశ్ లేఖ
- జాతీయ హ్యాండ్లూమ్ బోర్డులను రద్దు చేసిన కేంద్రం
- ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసిన లోకేశ్
- రాష్ట్ర నేతన్నలను కాపాడాలంటూ మంత్రి గౌతమ్ రెడ్డికి వినతి
జాతీయ హ్యాండ్లూమ్ బోర్డు పునరుద్ధరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ లేఖ రాశారు. రాష్ట్ర చేనేత రంగం ఘనతర వారసత్వాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఖాదీ, చేనేత రంగాలతో ఏపీ జాతీయస్థాయిలో ఎంతో గుర్తింపు సంపాదించుకుందని, ఈ పరిశ్రమపై ఆధారపడి లక్షల మంది బతుకుతున్నారని తెలిపారు. పొందూరు, ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు.
కానీ కేంద్రం ఈ ఆగస్టులో ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆలిండియా హ్యాండిక్రాఫ్ట్స్ బోర్డు, ఆలిండియా పవర్ లూమ్ బోర్డులను రద్దు చేసిందని వెల్లడించారు. తద్వారా చేనేత కార్మికులు, ఈ పరిశ్రమపై ఆధారపడిన ఇతరులు ఇకపై కేంద్రాన్ని సాయం కోరాలంటే ఏ సంస్థ ద్వారా సంప్రదించాలనేది ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో చేనేత రంగం ఆర్థికంగా కుదేలవడమే కాకుండా, కార్మికులు మానసిక వేదనకు లోనవుతున్నారని వివరించారు.
ఇటీవల ప్రకటించిన 'నేతన్న నేస్తం' పథకం ఉద్దేశం ఎంతో అభినందనీయమే అయినా, అమలు విషయానికొచ్చేసరికి దారుణంగా ఉందని పేర్కొన్నారు. ఈ పథకంలో ఎంతోమంది నేతన్నల పేర్లు చేర్చలేదని, పథకంలో నమోదైన వారికంటే తొలగించబడిన వారే ఎక్కువ మంది ఉన్నారని లోకేశ్ స్పష్టం చేశారు. కేంద్రం హఠాత్తుగా మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో, ఇటు రాష్ట్ర సహకారం కూడా కొరవడడంతో రాష్ట్ర చేనేత రంగ కార్మికులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
"జాతీయ స్థాయి హ్యాండ్లూమ్ బోర్డులను కొనసాగించాలని కోరుతూ నేను గతంలో కేంద్రానికి రాసిన లేఖను కూడా ఈ లేఖతో జతచేస్తున్నాను. లక్షలాది మంది చేనేత కార్మికుల జీవితాలను మెరుగుపరచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా సహకరించిన వాళ్లమవుతాం. ఇది మన బాధ్యతే కాదు, మన వస్త్ర తయారీ రంగం పరంపరను కాపాడడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం కూడా. అందుకే ఈ అంశాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లి, వారిపై ఒత్తిడి తెచ్చి నేతన్నల ప్రయోజనాలను కాపాడతారని ఆశిస్తున్నాను" అంటూ సుదీర్ఘమైన లేఖ రాశారు.