TS BPass Bill: విప్లవాత్మక తెలంగాణ బీ పాస్ బిల్లుకు శాసనసభ ఆమోదం... రెండు కోణాలను వివరించిన కేటీఆర్
- పురపాలక విధానంలో నవ్య పంథా
- స్థలాలకు అనుమతులు ఇక ఎంతో సులభతరం
- అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసుల్లేకుండా కూల్చేస్తామన్న కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ మరో విప్లవాత్మక బిల్లుకు ఆమోదం లభించింది. తెలంగాణ ఐ పాస్ తరహాలోనే తెలంగాణ బీ పాస్ బిల్లుకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే... ఇకపై జీహెచ్ఎంసీ సహా, అన్ని మున్సిపాలిటీల్లో 75 గజాల్లో ఇల్లు కట్టుకోవాలనుకునే వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. 600 గజాల లోపు అయితే స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతులు ఇచ్చేస్తారు.
600 గజాలపైన స్థలంలో నిర్మాణాలు జరపాలనుకుంటే దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తారు. నిర్దిష్ట గడువులోగా అనుమతి రాకపోతే, అనుమతి వచ్చినట్టే భావించేలా ఈ బీ పాస్ చట్టంలో నిబంధనలు పెట్టారు. దీనిపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, బీ పాస్ ద్వారా 95 శాతం మంది ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పుతుందని వివరించారు.
"75 గజాల స్థలం వరకు అయితే దరఖాస్తు చేసుకోనవసరంలేదు కానీ రిజిస్ట్రేషన్ అవసరం అవుతుంది. 75 గజాల పైన 600 గజాల లోపు అయితే స్వీయ ధ్రువీకరణ పత్రంతో వెంటనే అనుమతి లభిస్తుంది. 600 గజాల పైన బిల్డింగ్ పర్మిట్ కోసం కానీ, లే అవుట్ పర్మిషన్ కోసం కానీ దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లో అనుమతులు వస్తాయి. 21 రోజుల్లో అనుమతులు రాకపోతే 22వ రోజున డీమ్డ్ అప్రూవల్ అనే విధానం కూడా ఈ బీ పాస్ చట్టంలో ఉంది. తద్వారా ప్రజలకు అపారమైన మేలు జరిగే అవకాశం ఉంది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా 15 రోజుల్లో వస్తుంది. ఇది ఈ చట్టానికి ఒకవైపు మాత్రమే.
మరోవైపు... తక్షణ అనుమతి కింద ఎవరైనా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేసినా, ఇతరుల స్థలాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేసినా ఎలాంటి నోటీసులు లేకుండా కూలగొట్టే అధికారం కూడా ఈ చట్టంలో ఉంది. చెరువులో కట్టినా, నాలా మీద కట్టినా నోటీసులు ఇవ్వడం ఉండదు.. నేరుగా కూల్చడమే. ఇందులో మరో అభిప్రాయానికి తావులేదు" అని కేటీఆర్ స్పష్టం చేశారు.