Onion: ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం.. తక్షణం అమల్లోకి!
- అధిక వర్షపాతం కారణంగా దెబ్బతిన్న ఉల్లి పంటలు
- నెల రోజుల వ్యవధిలో మూడు రెట్లు పెరిగిన ఉల్లి ధరలు
- దేశంలో ఉల్లి లభ్యతను పెంచేందుకు చర్యలు
దక్షిణాది రాష్ట్రాల్లో అధిక వర్షపాతం కారణంగా ఉల్లిపంటలు దెబ్బతిని రేట్లు అమాంతం పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. నెల రోజుల వ్యవధిలోనే ధరలు మూడింతలు పెరిగాయి. దీంతో స్పందించిన కేంద్రం అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ (డీజీఎఫ్‌టీ) ఆఫీసు నోటిఫికేషన్ విడుదల చేసింది.
దక్షిణాసియాలో చాలా దేశాలు ముఖ్యంగా బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, శ్రీలంక వంటి దేశాలు ఉల్లి కోసం భారత్‌పైనే ఆధారపడతాయి. ఇక దేశంలోనే అతిపెద్ద ఉల్లిపాయల మార్కెట్ అయిన లాసల్‌గావ్‌లో నెల రోజుల వ్యవధిలో టన్ను ఉల్లిపాయల ధర మూడు రెట్లు పెరిగి ప్రస్తుతం రూ. 30 వేలుగా ఉంది. ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ. 40 పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలో ఉల్లి లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.