Umar Khalid: 11 లక్షల పేజీల డేటాను చూపుతూ... జేఎన్ వర్సిటీ మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్ ను ప్రశ్నించనున్న ఢిల్లీ పోలీసులు!

Delhi Student Leader Umar Khalid in Police Custody

  • 10 రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు
  • అల్లర్లు జరిగిన సమయంలో ఖలీద్ ఢిల్లీలో లేడు
  • స్పష్టం చేసిన అతని తరఫు న్యాయవాది

ఢిల్లీ జేఎన్ వర్సిటీ మాజీ విద్యార్థి, విద్యార్థి సంఘం నాయకుడు ఉమర్ ఖలీద్ ను ఇప్పటికే 10 రోజుల కస్టడీలోకి తీసుకున్న అధికారులు, అతని ముందు 11 లక్షల పేజీల సమాచారాన్ని చూపుతూ విచారించనున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ మాజీ విద్యార్థి ఖలీద్ ను గత వారంలో పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల వెనుక ఆయన హస్తం ఉందని అధికారులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, ఖలీద్ తరఫు న్యాయవాది మాత్రం, ఢిల్లీలో ఘర్షణలు జరిగిన ఫిబ్రవరి 23 నుంచి 26 మధ్య తన క్లయింట్ రాజధానిలోనే లేరని, పౌరసత్వ బిల్లును ఆయన వ్యతిరేకించినందునే, ఇటువంటి కక్షపూరిత చర్యలు చేపట్టి, అదుపులోకి తీసుకున్నారని, ఘర్షణల వెనుక ఆయన ప్రమేయం ఉందని పోలీసులు ఇంతవరకూ ఆధారాలను అందించలేదని ఆరోపిస్తుండటం గమనార్హం.

అయితే, తమ వద్ద ఎంతో సాంకేతిక సమాచారం ఉందని, దానిలో ఉమర్ ఖలీద్ ప్రమేయంపై ఆధారాలు కూడా ఉన్నాయని, వాటిని చూపుతూ అతన్ని ప్రశ్నించాల్సి వుందని కోర్టును కోరడంతో ఖలీద్ ను 10 రోజుల కస్టడీకి ఇచ్చేందుకు న్యాయమూర్తి అంగీకరించారు. ఇదిలావుండగా, ఖలీద్ అరెస్ట్ ను పలువురు పౌర సమాజ సభ్యులు ఖండిస్తున్నారు. ఇదే కేసులో ఆరోపణలు వచ్చిన బీజేపీ నేత కపిల్ మిశ్రాపై మాత్రం ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా ఫిబ్రవరి 24న మిశ్రా చేసిన విద్వేష పూరిత ప్రసంగాన్ని ఆధారంగా చూపుతున్నారు.

  • Loading...

More Telugu News