china: ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అవసరం లేదు: చైనా
- వైద్య సిబ్బంది వంటి వారికే వేయాలి
- మా దేశం కరోనాను కట్టడి చేసింది
- వ్యాక్సిన్ వేసే విషయంలో ఖర్చుల గురించి ఆలోచించాలి
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయత్నాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఆ వ్యాక్సిన్ రాగానే అందరికీ వేయాలని భావిస్తున్నాయి. కరోనా పుట్టినిల్లు చైనాలో ఆ వైరస్ ఇప్పటికే దాదాపు కట్టడిలోకి వచ్చింది. దీంతో తమ దేశంలో ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం లేదనే యోచనలో చైనా ఉంది.
కొవిడ్‌పై పోరాడుతున్న వైద్య సిబ్బంది వంటి వారికే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేయిస్తే సరిపోతుందని భావిస్తోంది. చైనా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ డైరెక్టర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. కొవిడ్ విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి దశల వారీగా చైనాపై కరోనా దాడి జరిగిందని అన్నారు.
ఈ క్రమంలో తమ దేశం ప్రతిసారి దాన్ని నిలువరించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసే విషయంలో ఖర్చులతో పాటు లాభనష్టాల వంటి అంశాలను పూర్తిస్థాయిలో గుర్తించవలసి ఉందని చెప్పింది.
భారీ స్థాయిలో వ్యాక్సిన్‌లు వేస్తూ వెళితే, అరుదుగా సంభవించే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. అందుకే, ప్రజలందరికీ టీకా వేయాల్సిన అవసరం లేదని అన్నారు. కాకపోతే భవిష్యత్తులో కరోనా తీవ్రత పెరిగితే ఈ విధానంలో మార్పు రావచ్చని ఆయన వ్యాఖ్యానించారు.