New Electricity act: కేంద్ర నూతన విద్యుత్ చట్టంపై తెలంగాణ సర్కారు తీవ్ర అసంతృప్తి
- తెలంగాణ అసెంబ్లీలో చర్చ ప్రారంభించిన మంత్రి జగదీశ్ రెడ్డి
- కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శలు
- మీటర్ల తయారీ డిస్కంలకు అదనపు భారం కానుందని వ్యాఖ్యలు
తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఇవాళ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కేంద్రం తీసుకువస్తున్న నూతన విద్యుత్ చట్టం, ఇతర అంశాలపై చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర నూతన విద్యుత్ చట్టంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రాలను సంప్రదించాకే కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కొత్త విద్యుత్ చట్టంతో రైతులకు సమస్యలు వస్తాయని తెలిపారు.
ఈ కొత్త విద్యుత్ చట్టంతో అన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాల్సి వస్తోందని, మీటర్ల తయారీ వ్యయం డిస్కంలకు పెనుభారంగా మారనుందని అన్నారు. పైగా, విద్యుత్ టారిఫ్ విధానం కూడా మారిపోతుందని తెలిపారు. పేదలు, బలహీన వర్గాల ప్రజలు భారీ మొత్తంలో బిల్లులు చెల్లించాల్సి రావొచ్చని వివరించారు.
కేంద్రం నూతన విద్యుత్ చట్టంతో ఎక్కడినుంచైనా విద్యుత్ తీసుకునే అవకాశం ఉందని, క్రాస్ సబ్సిడీ విధానం పాటిస్తున్న తెలంగాణకు అదనపు భారం కానుందని జగదీశ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దానికితోడు గ్రిడ్ ల నిర్వహణ భారం కూడా పెరుగుతుందని తెలిపారు.