Plasma Therapy: ప్లాస్మా థెరపీ వల్ల ఉపయోగం లేకుండా పోయింది: ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి

Plasma Therapy could not stop corona deaths

  • 14 రాష్ట్రాల్లోని 39 ఆసుపత్రుల్లో 469 మంది బాధితులపై అధ్యయనం
  • ప్లాస్మాదానంతో తగ్గని కరోనా మరణాలు, తీవ్రత
  • ప్లాస్మా థెరపీ కొనసాగింపుపై త్వరలో నిర్ణయం

ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా మరణాలను తగ్గించవచ్చంటూ నిన్నమొన్నటి వరకు వార్తలు వచ్చాయి. పలు రాష్ట్రాలు ప్లాస్మా బ్యాంకులను కూడా ఏర్పాటు చేశాయి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత దానం చేసే ప్లాస్మా వల్ల ప్రాణాలు నిలబడతాయన్న ఉద్దేశంతో ప్లాస్మా దానానికి పలువురు ముందుకొచ్చారు. అయితే, తాజాగా భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించిన విషయాలు దిగ్భ్రమకు గురిచేస్తున్నాయి.

14 రాష్ట్రాల్లోని 39 ఆసుపత్రుల్లో 469 మంది బాధితులపై చేసిన అధ్యయనంలో ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. కొవిడ్ మరణాలను ప్లాస్మా థెరపీ ఏమాత్రం తగ్గించలేకపోయిందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. మరణాలతోపాటు రోగ తీవ్రతను కూడా ఇది తగ్గించలేకపోయిందని పేర్కొన్నారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌తో కలిసి నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ అధ్యయన వివరాలు ఇంకా ప్రచురితం కాలేదు. దీనిపై శాస్త్రవేత్తల సమీక్ష కొనసాగుతోంది. సమీక్ష పూర్తయిన అనంతరం అధ్యయనం ప్రచురితం కానుంది. అధ్యయనంలో వెల్లడైన విషయాలను టాస్క్‌ఫోర్స్, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త పర్యవేక్షక బృందం పరిశీలించిన అనంతరం ప్లాస్మా థెరపీ విధానాన్ని కొనసాగించాలా? వద్దా? అన్న విషయాన్ని నిర్ణయిస్తాయని భార్గవ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News