Hema Malini: బాలీవుడ్ గురించి ప్రజలు చెడుగా మాట్లాడుకోవడం బాధను కలిగిస్తోంది: హేమమాలిని
- బాలీవుడ్ ఎప్పటికీ అత్యున్నత స్థాయిలోనే ఉంటుంది
- బాలీవుడ్ గురించి ప్రజలు చెడుగా మాట్లాడుకోవడం బాధాకరం
- కొన్ని రోజుల్లో ఈ మచ్చ తొలగిపోతుంది
బాలీవుడ్ ను డ్రగ్స్ వ్యవహారం షేక్ చేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఈ డ్రగ్స్ అంశం పార్లమెంటులో సైతం చర్చకు వచ్చింది. లోక్ సభలో రవికిషన్, రాజ్యసభలో జయాబచ్చన్ దీనిపై తమతమ వాదనలు వినిపించారు. మరోవైపు ఈ ఘటనపై సీనియర్ నటి హేమమాలిని స్పందించారు.
బాలీవుడ్ ఎప్పటికీ అత్యున్నత స్థాయిలోనే ఉంటుందని హేమమాలిని అన్నారు. తనకున్న పేరు, ఖ్యాతి, గౌరవం, హోదా ఇవన్నీ సినీ పరిశ్రమ నుంచే వచ్చాయని చెప్పారు. అలాంటి ఇండస్ట్రీపై ఈరోజు ఇలాంటి విమర్శలు రావడం చాలా బాధిస్తోందని చెప్పారు. అందరికీ తాను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానని... బాలీవుడ్ అనేది ఒక క్రియేటివ్ ప్రపంచమని... ఒక అందమైన ప్రదేశమని అన్నారు. అలాంటి బాలీవుడ్ గురించి ప్రజలు చెడుగా మాట్లాడుకోవడం బాధను కలిగిస్తోందని చెప్పారు. దేనిమీదైనా మచ్చ పడినప్పుడు దాన్ని కడిగేస్తే పోతుందని... ఇప్పుడు బాలీవుడ్ మీద పడిన మచ్చ కూడా కొన్ని రోజుల తర్వాత పోతుందని అన్నారు.
మరోవైపు హీరోయిన్ రియా చక్రవర్తికి నిన్న బెయిల్ ను నిరాకరిస్తూ ముంబై కోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో రియా కొందరు బాలీవుడ్ ప్రముఖుల పేర్లను వెల్లడించిందని... ఆమెకు బెయిల్ ఇస్తే, వారితో కలిసి సాక్ష్యాధారాలను నాశనం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.