Somu Veerraju: మూడు సింహాల మాయం ఘటనలో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది: సోము వీర్రాజు

Somu Veerraju questions kanakadurga temple eo on three lions missing

  • కనకదుర్గమ్మ వెండి రథాన్ని పరిశీలించిన సోము వీర్రాజు
  • మూడు సింహాలు ఏవంటూ ఈవోను ప్రశ్నించిన వైనం
  • లాకర్ లో ఉన్నాయన్న ఈవో
  • ఈవోపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ బీజేపీ చీఫ్

అంతర్వేది రథం దగ్ధం ఘటన సద్దుమణగక ముందే వైసీపీ సర్కారుకు మరో తలనొప్పి వచ్చిపడింది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి రథానికి ఉండాల్సిన మూడు సింహాలు మాయం కావడంపై విపక్షాలు ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వెండిరథం ఉంచిన ప్రాంతాన్ని పరిశీలించారు.

మూడు సింహాల ఘటనపై ఆలయ ఈవో సురేశ్ ను ప్రశ్నించారు. మూడు సింహాలు లాకర్ లో ఉండొచ్చని ఈవో సమాధానం ఇవ్వడంతో సోము వీర్రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రథానికి ఉండాల్సిన సింహాలు లాకర్ లో ఉండడం ఏంటని నిలదీశారు. మూడు సింహాల మాయం ఘటనలో ఈవో సమాధానం వింటుంటే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అన్నారు.

ఇదే అంశాన్ని సోము వీర్రాజు ట్విట్టర్ లోనూ ప్రస్తావించారు. దుర్గగుడిలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన రథం నిర్మాణంలో నాలుగు సింహాలను అమర్చారని, వాటిలో ఒకటి మాత్రమే మిగిలుందని, మరో మూడు సింహాలు కనిపించడంలేదని తెలిపారు. మిగిలిన ఒకటి కూడా అసంపూర్ణంగా ఉందని, ఈ ఘటనలో ఆలయ అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టమవుతోందని, అదే సమయంలో పవిత్రతను కాపాడే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోందని ట్వీట్ చేశారు.

ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణ జరిపి రెండ్రోజుల్లో వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఇవాళ సోము వీర్రాజు గవర్నర్ ను కలవనున్నారు. మూడు రథాల అంశాన్ని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News