Budda Venkanna: మంత్రి, ఈవో ప్రకటనలు చూస్తుంటే మూడు సింహాల మాయంలో వాళ్లిద్దరి పాత్ర ఉన్నట్టనిపిస్తోంది: బుద్ధా
- దుర్గమ్మ వెండి రథంలో మూడు సింహాల ప్రతిమలు మాయం
- ఘటన స్థలాన్ని పరిశీలించిన బుద్ధా వెంకన్న
- మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలు సరికాదని హితవు
ఏపీ ఆలయాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి రథానికి ఉండాల్సిన మూడు సింహాల ప్రతిమలు మాయం కావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వెండి రథం ఉంచిన ప్రదేశాన్ని పరిశీలించారు.
మూడు సింహాలు మాయం ఘటనపై మంత్రి, ఈవో చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఈ వ్యవహారంలో వాళ్లిద్దరికీ భాగస్వామ్యం ఉందేమోనన్న అనుమానం కలుగుతోందని అన్నారు. దుర్గగుడిలో వెండి రథంలోని మూడు సింహాలను దొంగిలించింది ఎవరో మంత్రి, ఈవోలకు తెలుసని, ఈ ఘటనకు వాళ్లిద్దరినీ బాధ్యులుగా చేస్తే తప్ప అసలు దొంగలెవరో బయటపడరని అభిప్రాయపడ్డారు. మూడు సింహాలు టీడీపీ హయాంలోనే పోయాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.
ఈ ఘటనపై పోలీస్ కమిటీ వేయకుండా నిజనిర్ధారణ కమిటీ వేయడం ఏంటని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. మూడు సింహాల ప్రతిమలు కనిపించకుండా పోతే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అన్నారు.