Jagan: మిమ్మల్ని కాపాడాలని నేను అనుకుంటే.. నన్ను అణచివేసేందుకు మీరు ప్రయత్నిస్తున్నారు: రఘురామకృష్ణరాజు
- వైసీపీ ప్రభుత్వంపై మరోసారి రఘురాజు విమర్శలు
- ఏపీ దేవాలయాలపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయి?
- నా ఫోన్ ట్యాప్ చేస్తారనే భయం కలుగుతోంది
ఏపీలో కేవలం హిందూ దేవాలయాలపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. కనకదుర్గమ్మ ఆలయంలోని రథానికి ఉన్న మూడు వెండి సింహాలు కనిపించకుండా పోవడం దురదృష్టకరమని చెప్పారు. మంత్రి ఇంటి పక్కనే ఉన్న దేవాలయాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని అన్నారు. ఇదే సమయంలో విజయవాడలోని సాయిబాబా గుడిలో విగ్రహాన్ని ధ్వంసం చేయడం విచారకరమని చెప్పారు. దేవాలయాలపై దృష్టి పెట్టే మంత్రిని నియమిస్తే బాగుంటుందని అన్నారు.
తనతో సన్నిహితంగా మెలుగుతున్న వైసీపీ ఎంపీలను కూడా పార్టీ నాయకత్వం సున్నితంగా బెదిరించిందని రఘురాజు తెలిపారు. తన ఫోన్ ను కూడా ట్యాప్ చేస్తారనే భయం తనకు ఉందని చెప్పారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తనను పిలవలేదని... ఈ విషయంపై లోక్ సభ స్పీకర్ కు తాను ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో ఉన్న శివశక్తి పాలకేంద్రం సరైన ధరను చెల్లించకుండా రైతుల నుంచి పాలను సేకరిస్తోందని... వైసీపీ ప్రభుత్వంలోని ఒక కీలక వ్యక్తి చేతుల్లో ఈ సంస్థ ఉందని రఘురాజు అన్నారు. అమరావతి భూములపై వేసిన సిట్ విచారణపై హైకోర్టు స్టే ఇవ్వడం మంచి పరిణామమని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ఎందరో భూములు కొన్నారని... ఇప్పుడు వారందరి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసింది ఇన్సైడర్ ట్రేడింగైతే... మీరు చేస్తున్నది ఔట్ సైడర్ ట్రేడింగా? అని ప్రశ్నించారు.
జగన్ చుట్టూ ఉన్న వారు చేస్తున్న చెడ్డ పనులతో ఆయనకు చెడ్డ పేరు వస్తోందని రఘురాజు ఆవేదన వ్యక్తం చేశారు. మిమ్మల్ని కాపాడాలని నేను ప్రయత్నిస్తుంటే... నన్ను అణచివేయాలని మీరు చూడటం బాధాకరమని అన్నారు. న్యాయ వ్యవస్థలపై దాడి చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగం ప్రకారం తనను అనర్హుడిగా ప్రకటించడం కుదరదని అన్నారు.