KCR: సుదర్శన్ రావు చిన్నవయసులోనే చనిపోవడం దురదృష్టకరం: సీఎం కేసీఆర్
- టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు సుదర్శన్ రావు మృతి
- గుండెపోటుతో మరణించిన సుదర్శన్ రావు
- ఇటీవలే కరోనా పాజిటివ్
టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు సుదర్శన్ రావు (62) ఈ ఉదయం గుండెపోటుతో హైదరాబాదు గచ్చీబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో మరణించారు. ఇటీవలే సుదర్శన్ రావు కరోనా బారినపడ్డారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుండగానే పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
సుదర్శన్ రావు మరణవార్తతో సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. పార్టీ ఆరంభం నుంచి ఉన్న తన సహచరుడు మృతి పట్ల ఆయన చలించిపోయారు. సుదర్శన్ రావు చిన్నవయసులోనే మృతి చెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పార్టీ తొలినాళ్లలో సుదర్శన్ రావు అద్భుతంగా పనిచేశాడని తెలిపారు. ఈ సందర్భంగా సుదర్శన్ రావు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
కాగా, సుదర్శన్ రావు సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడని పార్టీ వర్గాల్లో గుర్తింపు ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. 2009 ఎన్నికల్లో ఆయన కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ చేతిలో ఓటమిపాలయ్యారు.