KTR: తెలంగాణ గురించి ప్రపంచమంతా మాట్లాడుతుంటే కాంగ్రెసోళ్లకు కడుపు మండిపోతోంది: కేటీఆర్
- అభివృద్ధిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ
- కాంగ్రెస్ నేతలకు ఏమీ పట్టడంలేదన్న కేటీఆర్
- ఊకదంపుడు ఉపన్యాసం అంటూ భట్టిపై వ్యాఖ్యలు
గ్రేటర్ హైదరాబాద్, ఇతర పట్టణాల్లో అభివృద్ధి, మౌలిక వసతులపై అసెంబ్లీలో నేడు స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ గురించి యావత్ ప్రపంచం చర్చించుకుంటుంటే కాంగ్రెస్ నేతలకు పట్టడం లేదని అన్నారు. తెలంగాణ పురోగామి పథంలో పయనిస్తుంటే కాంగ్రెస్ నాయకులకు కడుపు మండిపోతోందని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ అత్యుత్తమ నగరం అని అనేక సర్వేల్లో వెల్లడైందని, కానీ కాంగ్రెస్ నేతలు ఇవేవీ పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. గాంధీభవన్ లో కూర్చుంటే ఏం అభివృద్ధి కనిపిస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడ్డాక గాంధీ భవన్ దివాళా తీసిందని, త్వరలోనూ టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. అంతగా తెలంగాణను అభివృద్ధి చేసినవాళ్లయితే కాంగ్రెస్ పార్టీ వాళ్లు 2014, 2018 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని కేటీఆర్ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆయన భట్టి విక్రమార్కపై విమర్శలు చేశారు. హైదరాబాదును తామే అభివృద్ధి చేశామని భట్టి విక్రమార్క చెబుతున్నారని, ఆయన మాట్లాడింది ఊకదంపుడు ఉపన్యాసం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత అయ్యుండి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వలేదని అన్నారు.