Balli Durga Prasad: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి... కరోనా చికిత్స పొందుతుండగా గుండెపోటు
- ఇటీవలే దుర్గాప్రసాద్ కు కరోనా పాజిటివ్
- చెన్నైలో చికిత్స
- ఈ సాయంత్రం విషమించిన పరిస్థితి
తిరుపతి ఎంపీ, వైసీపీ నేత బల్లి దుర్గాప్రసాద్ కరోనా మహమ్మారికి బలయ్యారు. దుర్గాప్రసాద్ ఇటీవలే కరోనా బారినపడ్డారు. కరోనా పాజిటివ్ అని తెలియడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ ఆయన ఈ సాయంత్రం కన్నుమూశారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది.
దుర్గాప్రసాద్ 1985లో రాజకీయ రంగప్రవేశం చేశారు. నాడు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల వైపు అడుగులేశారు. న్యాయవాద వృత్తిలో ఉంటూనే రాజకీయాల్లో ప్రవేశించారు. 28 ఏళ్ల ప్రాయంలో అసెంబ్లీ గడపతొక్కిన ఆయన గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. లోక్ సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.
ఆయన నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం నుంచి 4 పర్యాయాలు అసెంబ్లీకి వెళ్ళారు. ఆయన 1985, 1994, 1999, 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. 1996 నుంచి 98 వరకు మంత్రిగా వ్యవహరించారు.
నాయుడుపేట మండలం భీమవరం గ్రామం బల్లి దుర్గాప్రసాద్ స్వస్థలం. ఆయన తల్లిదండ్రులు పెంచలయ్య, రామలక్ష్మమ్మ. దుర్గాప్రసాద్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. దుర్గాప్రసాద్ మరణవార్త మీడియాలో రావడంతో ఆయన స్వస్థలంలో విషాద ఛాయలు అలముకున్నాయి.