Dr Reddys Lab: భారత్ లో రష్యా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్
- డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో ఆర్డీఐఎఫ్ ఒప్పందం
- రెడ్డీస్ ల్యాబ్ కు 100 మిలియన్ డోసులు సరఫరా చేసే అవకాశం
- ఇప్పటికే రష్యా మార్కెట్లో రిలీజైన స్పుత్నిక్ వి వ్యాక్సిన్
మానవ జాతికి వినాశకారిగా పరిణమించిన కరోనా వైరస్ భూతాన్ని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ రూపకల్పనలో అనేక దేశాలు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. అన్నిదేశాల కంటే ముందుగా రష్యా వ్యాక్సిన్ సిద్ధం చేసినట్టు ప్రకటించింది. రష్యాకు చెందిన గమలేయా ఇన్ స్టిట్యూట్ స్పుత్నిక్ వి పేరిట అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ను ఆర్డీఐఎఫ్ (రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్) సంస్థ తయారుచేస్తోంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ రష్యా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది.
అయితే, ఈ సంస్థ భారత్ లో స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం తాజాగా ప్రముఖ ఫార్మా రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్లినికల్ ట్రయల్స్ లో సానుకూల ఫలితాలు వస్తే డాక్డర్ రెడ్డీస్ ల్యాబ్ కు కూడా పెద్దమొత్తంలో వ్యాక్సిన్ డోసులు సరఫరా చేస్తామని ఆర్డీఐఎఫ్ తెలిపింది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు భారత్ లో ఆమోదం లభిస్తే 100 మిలియన్ డోసులు సరఫరా చేస్తామని వివరించింది. త్వరలోనే రెడ్డీస్ ల్యాబ్ స్పుత్నిక్ వి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది.