Yanamala: ఆర్థిక నేరాల కేసులను ఆలస్యం చేయొద్దని సుప్రీం చెప్పడంతో జగన్ భయపడుతున్నారు: యనమల
- వేగంగా పరిష్కరించాలని ఆదేశించింది
- 2,500 మంది రాజకీయ నేతల కేసులు పెండింగ్ లో ఉన్నాయి
- అందులో 12 ఛార్జ్‌షీట్లు సీబీఐ కోర్టులో జగన్‌పై దాఖలు చేసినవే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతి, ఆర్థిక నేరాల కేసులను ఆలస్యం చేయొద్దని, వేగంగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో జగన్‌కు భయం పట్టుకుందని అన్నారు. దేశంలో 2,500 మంది రాజకీయ నేతల కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన చెప్పారు.
వాటిలో 12 ఛార్జ్‌షీట్లు సీబీఐ కోర్టులో జగన్‌పై దాఖలు చేసినవేనని ఆయన అన్నారు. విచారణకు భయపడి ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తూ ప్రజలదృష్టిని మళ్లించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా గత సర్కారు ఐదేళ్ల పాలనపై విచారణ జరిపిస్తామని, వైసీపీ అనడం విడ్డూరమని ఆయన చెప్పారు.
ఇటువంటి చర్యలు చట్ట వ్యతిరేకం కాబట్టే హైకోర్టు స్టే ఇచ్చిందని ఆయన చెప్పారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నానని ఆయన చెప్పారు. పత్రికా హక్కులు అంటూ మాట్లాడే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి బాగా ఆలోచించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు. వైసీపీ సొంత మీడియా నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన చెప్పారు.