Raghu Rama Krishna Raju: సొంత పార్టీ ఎంపీపై లోక్ సభలో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన రఘురామకృష్ణరాజు
- బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ పై నోటీసిచ్చిన రఘురాజు
- తనను కించపరిచే విధంగా మాట్లాడారని ఆరోపణ
- వీడియో ఫుటేజీ కూడా అందజేసిన వైనం
వైసీపీలో అంతర్గత పోరు ముదురుతోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును డిస్ క్వాలిఫై చేయాలని ఇంతకు ముందే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా లోక్ సభలో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ పై ఓం బిర్లాకు రఘురామకృష్ణరాజు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. మీడియాతో సురేశ్ మాట్లాడుతూ తనను దుర్భాషలాడారని, కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని తన నోటీసులో పేర్కొన్నారు. దీంతో పాటు మీడియాతో సురేశ్ మాట్లాడిన వీడియో ఫుటేజీని కూడా స్పీకర్ కు అందజేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు.
నిన్న పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో నందిగం సురేశ్ మాట్లాడుతూ, రఘురాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ సీఎంను, ఎంపీలను ఉద్దేశించి పిచ్చి వాగుడు వాగితే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతామని హెచ్చరించారు. మిథున్ రెడ్డికి నాలుగు ఓట్లు కూడా పడవని రఘురాజు అంటున్నారని... మోసగాడు, చీటర్ వంటి పదవులకు పోటీ పడితే రఘురాజుకు ఎంపీల ఓట్లన్నీ పడతాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపైనే స్పీకర్ కు రఘురాజు ఫిర్యాదు చేశారు.