Supreme Court: నేర చరిత్ర గల నేతల కేసులపై సుప్రీంకోర్టు సంచలన సూచనలు!
- నిర్దిష్ట వ్యవధిలోగా కేసులను తేల్చాల్సిందే
- వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని హైకోర్టులకు సూచన
- 9 అంశాలను యాక్షన్ ప్లాన్ లో చేర్చాలని ఆదేశం
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. నిర్దిష్ట వ్యవధిలోగా కేసులను తేల్చాల్సిందేనని తెలిపింది. అవినీతి నేతల భరతం పట్టేందుకు కార్యాచరణను వేగవంతం చేసింది. పెండింగ్ కేసుల పరిష్కారానికి సంబంధించి వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని హైకోర్టులకు సూచించింది. 9 అంశాలను యాక్షన్ ప్లాన్ లో చేర్చాలని ఆదేశించింది.
ప్రతి జిల్లాలో ఉన్న పెండింగ్ కేసులు, ప్రత్యేక కోర్టుల సంఖ్య, అందుబాటులో ఉన్న కోర్టులు, జడ్జిల సంఖ్య, పదవీకాలం, ప్రతి జడ్జి ఎన్ని కేసులు పరిష్కరించగలరు, పరిష్కారానికి పట్టే సమయం, కోర్టుల మధ్య దూరం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన వివరాలను పొందుపరచాలని సూచించింది. స్టే ఉన్న కేసులను కూడా రెండు నెలల్లో ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పింది. అమికస్ క్యూరీ ఇచ్చిన సిఫారసులపై హైకోర్టు చీఫ్ జస్టిస్ లు సలహాలు, సూచనలు ఇవ్వాలని తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.