Siromani Akalisal: ఇక వెనక్కు తగ్గబోము... ఎన్డీయేలో కొనసాగడంపై సమీక్షిస్తున్నాం: సుఖ్ బీర్ బాదల్ సంచలన వ్యాఖ్యలు!
- ఎన్డీయే వ్యవస్థాపక పార్టీల్లో అకాలీదళ్ ఒకటి
- చిచ్చు పెట్టిన వ్యవసాయ బిల్లులు
- పార్టీ కోర్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంటుంది
- మీడియాతో సుఖ్ బీర్ బాదల్
తాము వ్యతిరేకించిన వ్యవసాయ నియంత్రణా బిల్లులను పట్టుదలతో బీజేపీ ఆమోదింపజేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న శిరోమణి అకాలీదళ్, ఇప్పుడు ఎన్డీయే నుంచి వైదొలగడంపై ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని పార్టీ అధినేత సుఖ్ బీర్ బాదల్ స్వయంగా వెల్లడించారు.
ఇక వెనక్కు తగ్గబోమని, పార్టీ కోర్ కమిటీ ఈ విషయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న ఆయన భార్య, కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత లోక్ సభలో తనకున్న బలంతో ఈ బిల్లులను బీజేపీ ఆమోదింపజేసుకుంది.
"తొలి రోజు నుంచి ఈ ఆర్డినెన్స్ లను మేము వ్యతిరేకిస్తున్నాం. క్యాబినెట్ భేటీలో సైతం హర్ సిమ్రత్ కౌర్ వీటిని బలంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ పంజాబ్ రైతుల మనోభావాలను మరిచి, వీటిని ఆర్డినెన్స్ ల రూపంలో తీసుకుని వచ్చారు. ఈ బిల్లుల విషయంలో రైతులను సంప్రదించ కుండానే ఆమోదింపజేసుకున్నారు. ప్రభుత్వంలో భాగంగా ఉన్న మేము, బిల్లుల విషయంలో రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. అయినా వీటిపై పునరాలోచించకపోవడం దురదృష్టకరం. రైతుల హక్కులను పరిరక్షించలేని నాడు, మేము ప్రభుత్వంలో కొనసాగడం అర్ధరహితం. ప్రభుత్వం మనసు మార్చేందుకు రెండు నెలల పాటు ప్రయత్నించాం. ఇక వెనక్కు తగ్గేది లేదు" అని ఆయన అన్నారు.
ఇదే సమయంలో ఎన్డీయేలో కొనసాగుతారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, "ఎన్డీయే వ్యవస్థాపక సభ్యుల్లో మేము కూడా ఉన్నాం. కానీ ఇటువంటి పరిస్థితి రావడం బాధాకరం. పరిస్థితిని సమీక్షిస్తున్నాం. పార్టీ ఉన్నత కమిటీ సమావేశమై, అన్ని నిర్ణయాలూ తీసుకుంటుంది" అని సుఖ్ బీర్ బాదల్ స్పష్టం చేశారు.