Narendra Modi: తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టిస్తారు.. జాగ్రత్తగా ఉండండి: నరేంద్ర మోదీ
- వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలు జరుగుతుంది
- తాముతెస్తున్న చట్టం చారిత్రాత్మకమైనది
- ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశ పెట్టిన వ్యవసాయ సంబంధిత బిల్లులకు ఆమోదముద్ర పడింది. ఈ బిల్లులకు రాజ్యసభ ఆమోదం కూడా లభిస్తే చట్ట రూపం దాలుస్తాయి. అయితే ఈ బిల్లులను విపక్షాలే కాకుండా, తమ సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రపక్షం కూడా వ్యతిరేకిస్తుండటం బీజేపీ సర్కారును ఇబ్బంది పెడుతోంది. తమ మిత్రపక్షమైన శిరోమణి అకాళీదల్ కి చెందిన ఏకైక మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ బిల్లుల వల్ల రైతాంగం, వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోతాయని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ఈ బిల్లులపై ప్రధాని మోదీ మాట్లాడుతూ, రైతలుకు కనీస మద్దతు ధరను కల్పించేందుకు ఈ బిల్లులు తోడ్పడతాయని చెప్పారు. తమకు వస్తున్న సరికొత్త అవకాశాలను కొందరు వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని రైతులు గమనిస్తున్నారని చెప్పారు. రైతుల కోసం తాము తెస్తున్న చట్టం చారిత్రాత్మకమని అన్నారు. రైతు సమస్యలను తప్పుదోవ పట్టించేవారి విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో ద్వారా స్పందించారు.
రైతుల నుంచి గోధుమలు, బియ్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని... ఇవన్నీ రైతులను మోసగించే ప్రయత్నాలని మోదీ అన్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ, తప్పుదోవ పట్టించాలకునేవారి విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మీ అందరినీ బాధలు, ఇబ్బందుల్లో ఉంచడమే వారి లక్ష్యమని చెప్పారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న వీరంతా... రైతుల గురించి, రైతు సమస్యల గురించి ఉపన్యాసాలు ఇవ్వడమే కానీ... నిజంగా వారికి చేసిందేమీ లేదని అన్నారు.