Dubai: అక్టోబరు 2 వరకు ఎయిరిండియా విమానాల రాకపోకలను రద్దు చేసిన దుబాయ్
- ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానాల్లో కరోనా పాజిటివ్ వ్యక్తులు
- నెగెటివ్ ఉంటేనే రావాలని స్పష్టీకరణ
- గత రెండు వారాల్లో రెండు ఘటనలతో అప్రమత్తం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో భారత్ నుంచి రాకపోకలు సాగిస్తున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానాలపై అక్టోబరు 2 వరకు సస్పెన్షన్ విధించింది. గత రెండు వారాల్లో ఇద్దరు వ్యక్తులు కరోనా పాజిటివ్ సర్టిఫికెట్లతో ఈ విమానాల్లో ప్రయాణించినట్టు దుబాయ్ పౌర విమానయాన సంస్థ గుర్తించింది.
యూఏఈ నిబంధనల ప్రకారం భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు విధిగా కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అది కూడా, ప్రయాణానికి 96 గంటల ముందు ఆర్టీ పీసీఆర్ విధానంలో కరోనా టెస్టు చేయించుకుని ఉండాలి. అయితే, సెప్టెంబరు 4న కరోనా పాజిటివ్ ఉన్న ఓ వ్యక్తి జైపూర్-దుబాయ్ విమానంలో ప్రయాణించగా, అంతకుముందు మరో వ్యక్తి ఇదే తరహాలో కొవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్ తో విమానంలో దుబాయ్ వచ్చినట్టు వెల్లడైంది.
ఈ ఘటనలను దుబాయ్ పౌర విమానయాన సంస్థ తీవ్రంగా పరిగణించింది. సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 2 వరకు ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానాల రాకపోకలను నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ స్పందిస్తూ, దుబాయ్ పౌర విమానయాన సంస్థ నుంచి నోటీసులు అందినట్టు నిర్ధారించింది.