Nadendla Manohar: విద్యారంగానికి భారీగా నిధులు తగ్గించారంటూ ఏపీ సర్కారుపై జనసేన విమర్శలు
- ఎన్ఈపీ-2020 వెబినార్లో పాల్గొన్న నాదెండ్ల మనోహర్
- రాష్ట్ర విద్యాశాఖను తీవ్ర సంక్షోభంలోకి నెట్టారని వెల్లడి
- ఏపీలో అక్షరాస్యత 66.4 శాతం మాత్రమేనన్న నాదెండ్ల
రాష్ట్ర విద్యా రంగానికి ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోందని జనసేన పార్టీ విమర్శించింది. జనసేన పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ ఈ మేరకు ఓ ప్రకటనలో స్పందించారు. జాతీయ విద్యావిధానం-2020 యూత్ పార్లమెంట్ వెబినార్ లో ఆయన మాట్లాడుతూ... విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న వైసీపీ సర్కారు నిధుల కేటాయింపులో మాత్రం భారీగా కోతలు విధిస్తోందని, ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. సుమారు రూ.7,700 కోట్ల మేర కోతలు విధించి రాష్ట్ర విద్యాశాఖను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేశారని విమర్శించారు.
జాతీయస్థాయిలో అక్షరాస్యత సగటు 77.7 ఉంటే, ఏపీలో అక్షరాస్యత శాతం 66.4 మాత్రమేనని పేర్కొన్నారు. ఈ దుస్థితికి రాష్ట్ర సర్కారు పాటిస్తున్న లోపభూయిష్టమైన విద్యావిధానాలే కారణమని ఆరోపించారు. 2019-20 సంవత్సరానికి గాను విద్యా రంగానికి రూ.32,618 కోట్లు కేటాయిస్తే, 2020-21 సంవత్సరానికి రూ.25,201 కోట్లేనని వెల్లడించారు.
మొత్తం బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులను 14.31 నుంచి 11.21 శాతానికి కుదించి విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారని వివరించారు. కేటాయింపులు తగ్గిస్తున్న తీరు చూస్తుంటే ప్రభుత్వానికి విద్యారంగంపై ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోందని విమర్శించారు.