India: గత కొన్ని రోజులుగా కదలిక లేని బంగారం ధర!
- ఇటీవలి కాలంలో పరుగులు పెట్టిన బంగారం ధర
- పక్షం రోజులుగా పడుతూ, లేస్తూ నడక
- శుభకార్యాలు లేకపోవడమే కారణమంటున్న నిపుణులు
బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. లేకుంటే తగ్గుతూ ఉంటాయి. ఇందుకు అంతర్జాతీయ మార్కెట్ తో పాటు, ఇండియాలోని పరిస్థితులు కూడా కారణం అవుతూ ఉంటాయి,. వివాహాది శుభకార్యాల సీజన్ నడుస్తుంటే, లేదా ధన త్రయోదశి, అక్షయ తృతీయ వంటి పర్వదినాలకు ముందు ఇండియాలో బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. ఆపై ఆషాఢ మాసంలో, ముహూర్తాలు లేని వేళల్లో తగ్గుతూ ఉంటాయి.
కానీ, ఇప్పుడు పరిస్థితి విచిత్రంగా మారింది. పండగ సీజన్ దగ్గర పడుతున్నా, బంగారాన్ని కొనుగోలు చేసేవారు కనిపించడం లేదు. నెలన్నర క్రితం, గరిష్ఠంగా, పది గ్రాములకు రూ. 57 వేల వరకూ వెళ్లిన ధర, ఇప్పుడు రూ. 50 వేలకు దిగివచ్చినా, అమ్మకాలు అంతగా సాగడం లేదు. మరోవైపు వెండి విషయంలోనూ ఇదే పరిస్థితి.
కరోనాకు వ్యాక్సిన్ రానుందన్న వార్తలు, మరోసారి స్టాక్ మార్కెట్ ను పెంచుతుండటం, డాలర్ విలువ బలపడుతూ ఉండటంతో, ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం ధర స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగుతుండగా, ఇండియాలోనూ అదే పరిస్థితి నెలకొంది. గడచిన వారం రోజులుగా బంగారం ధర రూ. 51 వేల నుంచి రూ. 52 వేల మధ్యే కదలాడుతూ ఉండటం గమనార్హం.
ఇక, దసరా సీజన్ మొదలైతే, ధరలు పుంజుకోవచ్చని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతియేటా దసరా, దీపావళి సీజన్ లో శుభకార్యాలతో పాటు ధన త్రయోదశి పర్వదినం కూడా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమ్మకాలు అనుకున్నంత సంతృప్తిగా సాగకున్నా, మరో నెలలో పరిస్థితి మారుతుందని భావిస్తున్నామని జ్యూయెలరీ సంస్థలు అంచనా వేస్తున్నాయి.