Sandalwood: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసు.. మాజీ ఎమ్మెల్యే తనయుడికి నోటీసులు
- తీగ లాగితే కదులుతున్న డొంక
- మరో ముగ్గురి పేర్లు వెలుగులోకి
- నేడు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు
శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో తీగ లాగుతుంటే డొంక కదులుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులు, మహిళా నటులు చిక్కుకోగా, తాజాగా మరో ముగ్గురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో నటుడు, వ్యాఖ్యాత అకుల్ బాలాజీ, మాజీ ఎమ్మెల్యే ఆర్వీ దేవరాజ్ తనయుడు ఆర్వీ యువరాజ్, కొన్ని కన్నడ సినిమాల్లో నటించిన నటుడు సంతోష్ కుమార్‌ల పేర్లు బయటకు వచ్చాయి. నేటి ఉదయం పది గంటలకు తమ ఎదుట హాజరు కావాలంటూ శుక్రవారం వీరికి సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
తాను హైదరాబాద్‌లో ఉండడంతో నేటి విచారణకు హాజరు కాలేనని, కొంత సమయం కావాలని అకుల్ బాలాజీ బదులివ్వగా, అయితే, విమానంలో రావాలని అధికారులు సూచించారు. దీనికి ఆయన సరేనన్నట్టు తెలుస్తోంది. తనకు నోటీసులు జారీ కావడంపై బాలాజీ స్పందిస్తూ తనకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని, తాను హోస్ట్‌గా వ్యవహరించిన పలు తెలుగు, కన్నడ కార్యక్రమాల్లో నటీనటులు పాల్గొంటున్న నేపథ్యంలో నోటీసులు జారీ చేసి ఉంటారని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు.
డ్రగ్స్ కేసులో తన కుమారుడి పేరు బయటకు రావడంపై మాజీ ఎమ్మెల్యే ఆర్వీ దేవరాజ్ స్పందించారు. తన కుమారుడికి ఎటువంటి చెడు వ్యసనాలు లేవని, పలు కార్యక్రమాల్లో పాల్గొనడం, పరిశ్రమకు చెందిన పలువురితో సంబంధాలు ఉండడంతోనే పోలీసులు విచారణకు పిలిచి ఉంటారని, విచారణకు యువరాజ్ హాజరవుతాడని తెలిపారు.
కాగా, ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్టు సీసీబీ జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు.