IYR Krishna Rao: ఈ అవసరం ఏమి వచ్చిందో టీటీడీ అధ్యక్షులు సెలవిస్తే బాగుంటుంది: ఐవైఆర్ కృష్ణారావు
- తిరుమలకు అన్యమతస్థులూ వస్తారు
- డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ ఛైర్మన్ చెప్పారు
- ఉన్నపళంగా ఈ మార్పు ఎందుకు?
తిరుమలకు వచ్చే అన్యమతస్థులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారంటూ ఈనాడు దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేసిన ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దీనిపై తన అభిప్రాయాలను చెప్పారు.
'ఈ నిబంధన ఈనాటిది కాదు. ఎన్నో సంవత్సరాలుగా టీటీడీలో కొనసాగుతున్న నిబంధన. విద్యార్థి దశలో తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు మాతోపాటు క్యూలో ఉన్న విదేశీయుడిని డిక్లరేషన్ సంతకం పెట్టిన తర్వాత దర్శనానికి అనుమతించారు' అని ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు.
'సోనియా గాంధీ దర్శనానికి వచ్చినప్పుడు కూడా నాటి కార్యనిర్వహణాధికారి ఈ డిక్లరేషన్ కొరకు గట్టిగా పట్టుబట్టి కొందరు నేతల ఆగ్రహానికి గురయ్యాడు. ఈనాడు ఉన్నపళంగా ఈ మార్పు తీసుకుని రావాల్సిన అవసరం ఏమి వచ్చిందో టీటీడీ అధ్యక్షులు సెలవిస్తే బాగుంటుంది' అని ఐవైఆర్ కృష్ణారావు నిలదీశారు.
'రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రే వస్త్రాలు సమర్పించాలని ఎక్కడా లేదు. నమ్మకం లేని నాడు ఆ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ మంత్రి నిర్వహించవచ్చు' అని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు.