Kodandaram: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కోదండరాం.. మద్దతివ్వాలని ప్రతిపక్ష పార్టీలను కోరిన టీజేఎస్
- నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా కోదండరాం
- శాసనమండలిలో గొంతెత్తేందుకు కోదండరాం లాంటి నాయకుడు అవసరమన్న టీజేఎస్
- కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష పార్టీలకు లేఖలు
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన గెలుపు అత్యవసరమని, మద్దతివ్వాలని కోరుతూ ఆయన సారథ్యంలోని తెలంగాణ జనసమితి (టీజేఎస్) ప్రతిపక్ష పార్టీలను కోరింది. తెలంగాణలో త్వరలో పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కోదండరాం పోటీ చేయనున్నట్టు ఇది వరకే వార్తలు వచ్చాయి.
నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కోదండరాం గెలుపును నిరుద్యోగులు, యువత కోరుకుంటున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో శాసన మండలిలో వారి తరపున గొంతెత్తేందుకు కోదండరాం లాంటి నాయకుడు అవసరమని టీజేఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కోదండరాంకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమొక్రసీ పార్టీలకు టీజేఎస్ లేఖలు రాసింది.