Chandrababu: ఒక నమ్మకం లేని వ్యక్తి కోసం అనాదిగా అనుసరిస్తున్న సంప్రదాయాన్ని మార్చడం సమాజానికే అరిష్టం: చంద్రబాబు
- అన్యమతస్థులకు డిక్లరేషన్ అవసరంలేదన్న వైవీ
- ఇది ఆధ్యాత్మిక ద్రోహమన్న చంద్రబాబు
- ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ ఆగ్రహం
శ్రీవారి దర్శనానికి అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన విమర్శలపాలవుతోంది. దీనిపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఒక నమ్మకంలేని వ్యక్తి కోసం అనాదిగా అనుసరిస్తున్న సంప్రదాయాన్ని మార్చడం అనాచారమని పేర్కొన్నారు. ఈ తీరు సమాజానికే అరిష్టమని, పైగా అది ఆధ్యాత్మిక ద్రోహం కూడా అని వ్యాఖ్యానించారు.
అసలు మతం అంటేనే నమ్మకం అని, ఎవరైనా సరే స్వామిపై నమ్మకంతో రావడం కోసమే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు డిక్లరేషన్లు ఇచ్చే సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారని వివరించారు. మన సంస్కృతికి మూలం సనాతన ధర్మమేనని చెబుతూ వాల్మీకి ప్రవచించిన 'ఏషః ధర్మః సనాతనః' అనే వాక్యాన్ని ఉదహరించారు.
సనాతనం అంటే ప్రాచీనమైన, నిత్యమైన, ఏనాటికీ మారని శాశ్వత ధర్మం అని తెలిపారు. అలాంటి ధర్మాలు, సంప్రదాయాలు పాలకులు మారినప్పుడల్లా మారవు అని చంద్రబాబు స్పష్టం చేశారు. అలా మార్చాలనుకోవడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శించారు.