Raghu Rama Krishna Raju: అన్యమతస్థుల డిక్లరేషన్ లో జగన్ ఎందుకు సంతకం చేయలేదు?: ఎంపీ రఘురాజు
- సంతకం అవసరం లేదన్న టీటీడీ ఛైర్మన్ పై చర్యలు తీసుకోవాలి
- దేవుడి సొమ్మును దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి
- హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దు
తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి ఏ మతస్థులైనా రావచ్చని... శ్రీవారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గతంలో కూడా టీటీడీకి ఎవరూ ఇవ్వలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ... అన్యమతస్థుల డిక్లరేషన్ లో ముఖ్యమంత్రి జగన్ ఎందుకు సంతకం చేయలేదని ప్రశ్నించారు. సెక్యులర్ వాదినని చెప్పుకునే జగన్ సంతకం చేయాలని అన్నారు.
డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన టీటీడీ ఛైర్మన్ పై చర్యలు తీసుకోవాలని రఘురాజు డిమాండ్ చేశారు. తిరుమల ఆలయ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దేవుడి సొమ్మును దోచుకునే ప్రయత్నం జరుగుతోందని... ప్రభుత్వ బాండ్లలో టీటీడీ నిధులను ఇన్వెస్ట్ చేయడం సరికాదని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయవద్దని కోరారు. న్యాయవ్యవస్థను కించపరిచేలా వైసీపీ ఎంపీలు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. తనకు వస్తున్న బెదిరింపులు, కేసులు, అనర్హత వేటుకు సంబంధించి ప్రధాని మోదీకి లేఖ ద్వారా తెలియజేశానని చెప్పారు.