India: కరోనా రికవరీల్లో ప్రపంచంలోనే భారత్‌‌ది అగ్రస్థానం

India in First place in Corona recovery

  • బ్రెజిల్, అమెరికాలను వెనక్కి నెట్టేసిన భారత్
  • ప్రపంచ రికవరీల్లో 18.83 శాతంతో ముందున్న ఇండియా
  • దేశంలో 57.49 శాతం మరణాలు ఆ మూడు రాష్ట్రాలలోనే

కరోనా రికవరీల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయంలో అమెరికా, బ్రెజిల్‌లను అధిగమించింది. నిన్న ఒక్కరోజే ఏకంగా 95,880 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 42,08,431కి పెరిగింది. కరోనా రికవరీల్లో ఇప్పటి వరకు 41,91,894 మందితో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, దానిని వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని ఆక్రమించినట్టు జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. నిజానికి రికవరీల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్న బ్రెజిల్, అమెరికాలను ఈ నెల 14నే భారత్ దాటిపోగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిన్న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఇక, ప్రపంచవ్యాప్త రికవరీల్లో భారత్ 18.83 శాతంతో ముందుంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా దేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశంలో రికవరీ రేటు 79.28 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. మే తొలి వారం నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నట్టు పేర్కొంది.

దేశవ్యాప్త రికవరీల్లో బీహార్ 91.8 శాతంతో తొలి స్థానంలో ఉండగా, తమిళనాడు (89.6 శాతం), పశ్చిమ బెంగాల్ (86.9 శాతం), ఆంధ్రప్రదేశ్ (85.3 శాతం), ఢిల్లీ (84.4 శాతం) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  

కేసుల సంఖ్య తగ్గుతున్నా మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 1,247 మంది చనిపోయారు. 1200 మందికిపైగా చనిపోవడం ఈ నెలలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఇక మొత్తం మరణాల్లో 57.49 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లలోనే నమోదైనట్టు ప్రభుత్వం తెలిపింది.

  • Loading...

More Telugu News