Agriculture Bill: వ్యవసాయ బిల్లులపై తెలుగు రాష్ట్రాలది చెరో దారి!
- వ్యవసాయ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం
- అనుకూలంగా వ్యవహరించిన వైసీపీ
- బిల్లును వ్యతిరేకించిన టీఆర్ఎస్
కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టం బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడం తెలిసిందే. ఈ బిల్లును ప్రధాన విపక్షం కాంగ్రెస్ వ్యతిరేకించింది. అంతేకాదు పలు ప్రాంతీయ పార్టీలు కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలుపలేదు. ఈ కొత్త వ్యవసాయ చట్టం బిల్లు విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెరోదారి అన్నట్టుగా వ్యవహరించాయి.
ఏపీ అధికార పక్షం వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు వ్యవసాయ బిల్లుకు ఆమోదం తెలుపగా, తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన సభ్యులు మాత్రం వ్యతిరేకించారు. సీఎం కేసీఆర్ మొదటి నుంచి ఈ బిల్లు పట్ల విముఖత వ్యక్తం చేస్తుండగా, సీఎం జగన్ మాత్రం స్వాగతించారు. ఇక, ఏపీ విపక్షం టీడీపీ ఈ బిల్లు పట్ల సానుకూలంగా వ్యవహరించింది.
ఇక, రాజ్యసభలో ఈ నూతన వ్యవసాయ చట్టం బిల్లు, దాని అనుబంధ బిల్లులపై చర్చ జరిగిన సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఈ బిల్లుల ద్వారా రైతులకు నచ్చిన చోట పంట విక్రయించుకునే సౌలభ్యం కలుగుతుందని, రైతులకు గిట్టుబాటు ధర లభ్యమవుతుందని అన్నారు. ఈ బిల్లు వస్తే ముందుగా నిర్ణయించుకున్న ధరకు రైతులు పంటను అమ్ముకునే వీలు కలుగుతుందని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం తగ్గుతుందని విజయసాయి అభిప్రాయపడ్డారు.
టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ స్పందిస్తూ, ఈ బిల్లుపై అనేక సందేహాలు ఉన్నాయని, రైతుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోందని అన్నారు. బిల్లుపై మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉందని చర్చ సందర్భంగా కేంద్రమంత్రిని కోరారు.