Yadadri: యాదాద్రి క్షేత్రంలోనూ తిరుమల తరహా భద్రతా ఏర్పాట్లు
- యాదాద్రి అభివృద్ధిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న సర్కారు
- ఆధునిక టెక్నాలజీ ఉపయోగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం
- బ్లూ ప్రింట్ రూపొందిస్తున్న ఐఎస్ డబ్ల్యూ, రాచకొండ పోలీసులు
తెలంగాణలో ఉన్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఆలయ పునరుద్ధరణ పనులు చేయిస్తున్నారు. దాదాపు 90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రిలోనూ తిరుమల తరహా భద్రతా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.
డ్రోన్లు, వాహనాల నెంబర్లు గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఏర్పాటు చేయడంతో పాటు, పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు అమర్చి, వాటి పర్యవేక్షణకు ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నెలకొల్పాలని ప్రణాళికలు రచిస్తున్నారు. వాహనాల స్కానర్లు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ల వంటి ఏర్పాట్లతో యాదాద్రి కొండను భద్రతా వలయంలో సురక్షితంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కొండపైకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని నెంబర్ రీడర్ టెక్నాలజీ పరికరం ట్రాక్ చేస్తుంది. దర్శనం టికెట్లు ఇచ్చే సమయంలో భక్తుడి ఫొటో తీస్తారు. రాష్ట్ర సర్కారు ఆమోదం లభిస్తే ఈ మేరకు భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ ను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్ డబ్ల్యూ), రాచకొండ పోలీసులు సంయుక్తంగా రూపొందిస్తున్నారు.
టెక్నాలజీ మాత్రమే కాకుండా, సాయుధ పోలీసులు, ఆక్టోపస్ కమాండోలు, యాంటీ టెర్రరిస్టు దళాలను కూడా యాదాద్రి భద్రత కోసం వినియోగించనున్నారు. ఈ మేరకు యాదాద్రి కొండపై ప్రత్యేకంగా ఓ పోలీస్ స్టేషన్ నిర్మించనున్నారు. అంతేకాదు, స్వామివారి బంగారు నగలు, ఇతర విలువైన ఆభరణాలు, కానుకలను పరిరక్షించేందుకు ప్రత్యేక సెక్యూరిటీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.