K. Keshava Rao: నా 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా ఎప్పుడూ జరగలేదు: టీఆర్ఎస్ నేత కేకే
- రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పక్షపాతంగా వ్యవహరించారు
- వ్యవసాయ బిల్లుల వల్ల మద్దతు ధర పెరగదు
- అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చింది అందుకే
కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు (కేకే) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల ఆమోదం విషయంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కేంద్ర ప్రభుత్వానికి పూర్తి పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. రాజ్యసభలో బీజేపీకి తగినంత బలం లేకపోయినా బలవంతంగా బిల్లులను ఆమోదింపజేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు.
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ పరం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు పంటకు మద్దతు ధర కల్పించేందుకు దోహదపడబోవని తేల్చి చెప్పారు. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలను డిప్యూటీ చైర్మన్ తోసిపుచ్చడం నిబంధనలకు వ్యతిరేకమని ధ్వజమెత్తారు. డిప్యూటీ చైర్మన్ తీరును నిరసిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. అవిశ్వాస తీర్మానం పెండింగులో ఉన్న సమయంలో డిప్యూటీ చైర్మన్ సభాధ్యక్షుడి హోదాలో కొనసాగడానికి అనర్హులని కేకే అన్నారు.