Hyderabad: డేంజర్ బెల్స్.. లక్షణాలు లేని కరోనా రోగులతో చాలా ప్రమాదం: తాజా అధ్యయనం
- అసింప్టమాటిక్ రోగుల్లో వైరస్ లోడు ఎక్కువ
- సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ సర్వేలో వెల్లడి
- 95 శాతం మంది రోగుల్లో 20 బిక్లేడ్ స్టెయిర్ వైరస్
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ సర్వేలో ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. కరోనా లక్షణాలు ఉన్నవారి కంటే లేని వారికే ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నట్టు ఈ సర్వేలో తేటతెల్లమైంది. అసింప్టమాటిక్ రోగుల్లోనే వైరస్ లోడు ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమైంది. మే, జూన్ నెలల్లో గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో కరోనా బారినపడిన 210 మంది రోగుల డేటాను సేకరించి విశ్లేషించిన అనంతరం ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంతేకాదు, 95 శాతం మందిలో 20 బి క్లేడ్ స్ట్రెయిట్ రకం వైరస్ ఉన్నట్టు తేలింది.
అసింప్టమాటిక్ రోగుల్లో వైరస్ లోడు అధికంగా ఉండడంతోపాటు రోగ నిరోధక శక్తి కూడా అదే స్థాయిలో ఉండడంతో వారంతా ఆరోగ్యంగా ఉన్నట్టు బయటకు కనిపిస్తుంటారని ఈ సర్వేలో తేలింది. వీరి నుంచి ఇమ్యూనిటీ స్థాయులు తక్కువగా ఉన్న వారికి వైరస్ సోకి వారి మరణానికి కారణమవుతున్నట్టు సర్వే గుర్తించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో తీసుకుంటే 70 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవు. మిగతా 30 శాతం మందిలోనే కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు వంటివి కనిపిస్తున్నాయి. వైరస్ లోడు ఎక్కువగా ఉండే అసింప్టమాటిక్ రోగుల నుంచి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారితోపాటు పిల్లలు, వృద్ధులకు సోకుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. పరోక్షంగా వారి మరణానికి కారణమవుతున్నట్టు పేర్కొన్నారు.