KTR: వ్యవసాయ బిల్లు అంత గొప్పదైతే ఒక్క రైతు కూడా ఎందుకు సంబరాలు చేసుకోవట్లేదు?: కేటీఆర్
- వ్యవసాయ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- వ్యతిరేకించిన టీఆర్ఎస్ ఎంపీలు
- ఎన్డీయే మిత్ర పక్షాలు ఎందుకు రాజీనామా చేస్తున్నాయన్న కేటీఆర్
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ వ్యవసాయ చట్టానికి సంబంధించిన బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించింది. దీనిపై కేటీఆర్ వ్యాఖ్యానిస్తూ, రైతులకు నమ్మదగిన నేస్తంలాంటి రాష్ట్ర రెవెన్యూ బిల్లును తెలంగాణ చట్ట సభలు ఆమోదించినప్పుడు విస్తృత స్థాయిలో సంబరాలు జరిగాయని, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో హర్షం వ్యక్తమైందని తెలిపారు.
కానీ, కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లు 2020 నిజంగా అంత గొప్పదే అయితే ఒక్క రైతు కూడా ఎందుకు సంబరాలు చేసుకోవట్లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఎందుకు రాజీనామా చేస్తున్నాయని నిలదీశారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేంద్రం నిన్న నూతన వ్యవసాయ చట్టం బిల్లును రాజ్యసభలో చర్చకు తీసుకురాగా, టీఆర్ఎస్ ఎంపీలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ ఈ బిల్లుకు పెద్దల సభ ఆమోదం పలికింది.