Raghu Rama Krishna Raju: దేవుడి సొమ్ము కొట్టేసినవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు: రఘురామకృష్ణరాజు
- రఘురామ ప్రెస్ మీట్
- జగన్ తన జేబులో డబ్బులేమీ ఇవ్వడంలేదని వ్యాఖ్యలు
- అమరావతి రాష్ట్ర సమస్య అని స్పష్టీకరణ
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తన రోజువారీ మీడియా సమావేశంలో భాగంగా విమర్శనాస్త్రాలు సంధించారు. తిరుమల వెంకన్న సంపదపై వైసీపీ నేతల కన్ను పడిందని అందరూ అనుకుంటున్నారని, కానీ దేవుడి సొమ్ము కొట్టేసినవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదని అన్నారు. "టీటీడీలో ఇద్దరు అధికారులను మార్చాల్సిన అవసరం ఎందుకొచ్చింది?" అని ప్రశ్నించారు. రథం తగలబడితే జగన్ తన జేబులో డబ్బులేమీ ఇవ్వడంలేదని, అది ప్రజల డబ్బేనని వెల్లడించారు.
అమ్మవారి వెండి విగ్రహాలు పోతే, ఆ పోయాయిలే అని తేలిగ్గా తీసిపారేయడం తగదని వ్యాఖ్యానించారు. దేవాలయాలపై జరిగిన దాడులు హిందువులకు తగిలిన గాయాలు అని పేర్కొన్నారు. పరిస్థితి ఇలావుంటే, మరోపక్క హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు అమరావతి అంశంపైనా స్పందించారు. గతంలో అత్తారింటికి దారేది అన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు అమరావతికి దారేది అంటున్నారని తెలిపారు. అమరావతి 20 గ్రామాల సమస్య కాదని, రాష్ట్ర సమస్య అని స్పష్టం చేశారు. తమ ఎంపీలు జీఎస్టీ బకాయిలపై కాకుండా ఇతర అంశాలపై పోరాటం చేస్తున్నారంటూ రఘురామ వ్యంగ్యం ప్రదర్శించారు.