Shiv Sena: బీజేపీతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని కూల్చేందుకు అధికారులు కుట్రలు పన్నుతున్నారు: శివసేన ఆరోపణ
- ఫడ్నవిస్ ప్రభుత్వమే ఉందని కొందరు అధికారులు భ్రమల్లో ఉన్నారు
- బీజేపీ అధికారంలోకి రాలేదనే బాధ వారిలో ఉంది
- ప్రభుత్వ రహస్యాలను విపక్షాలకు అందజేస్తున్నారు
కొందరు ప్రభుత్వోద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి శత్రువులుగా మారారని శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తమ మౌత్ పీస్ సామ్నా పత్రికలో కథనాన్ని వెలువరించింది. బీజేపీతో కుమ్మక్కైన కొందరు అధికారులు తమ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడింది. మహారాష్ట్రలో ఇంకా ఫడ్నవిస్ ప్రభుత్వమే అధికారంలో ఉందనే భ్రమల్లో కొందరు అధికారులు ఉన్నారని పేర్కొంది.
పోలీస్ కమిషనర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటు ప్రభుత్వంలోని కీలక శాఖల అధికారులను ఆరెస్సెస్ ప్రభావితం చేస్తోందని వ్యాఖ్యానించింది. బీజేపీ అధికారంలోకి రాలేదనే బాధ ఆ అధికారుల్లో ఉందని చెప్పింది. అయితే ఆ అధికారుల వివరాలను తాము ఇప్పుడు చెప్పబోమని తెలిపింది.
తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉండాలని సదరు అధికారులు భావిస్తున్నారని శివసేన మండిపడింది. ప్రభుత్వ రహస్యాలను కొందరు అధికారులు ప్రతిపక్షాలకు చేరవేస్తున్నారని చెప్పింది. ఈ వ్యవహారంపై హోంశాఖ దృష్టి సారించాలని వ్యాఖ్యానించింది.