Spain: కావాలని ఓడిపోయి క్రీడాస్ఫూర్తిని నింపిన డియాగో... 80 లక్షల మందికి పైగా చూసిన వీడియో ఇది!
- స్పెయిన్ లో ట్రయాథ్లాన్ పోటీలు
- డియాగో కన్నా ముందుగానే ఉన్న జేమ్స్
- చివరి క్షణాల్లో తడబడటంతో ఆగిపోయిన డియాగో
ఆటన్నాక ఒకరు గెలిస్తే, మరొకరు ఓడిపోవాల్సిందే. అది తప్పదు. కానీ ఆటలో క్రీడాస్ఫూర్తి ఎంతో ముఖ్యం. మరొక్క అడుగు వేస్తే, తాను గెలుస్తానని తెలిసి కూడా, ఆ విజయానికి అసలైన అర్హుడు వెనకే వస్తున్న మరో క్రీడాకారుడని గుర్తించి, చివరి క్షణంలో ఆగిపోయిన ఓ క్రీడాకారుడిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
మరిన్ని వివరాల్లోకి వెళితే, స్పెయిన్ లోని బార్సిలోనాలో ట్రయాథ్లాన్ పోటీలు జరిగాయి. ఇందులో ఆ దేశానికే చెందిన అథ్లెట్ డియాగో మెట్రిగో కూడా పాల్గొన్నాడు. మరికొన్ని అడుగులు వేస్తే, గెలుస్తానన్న దశలో నిదానించాడు. అప్పటివరకూ తనకన్నా ముందు ఉన్న బ్రిటన్ కు చెందిన జేమ్స్ అనే మరో క్రీడాకారుడు, చివరి క్షణాల్లో తడబడటాన్ని గమనించాడు. ఈ గెలుపు అతనికే సొంతం కావాలన్న ఆలోచనతో, ఫినిషింగ్ లైన్ ముందు నిలిచిపోయాడు.
డియాగో క్రీడాస్ఫూర్తిని చూసిన వీక్షకులు, పెద్దఎత్తున కరతాళ ధ్వనులు చేయగా, డియాగోను దాటి ఫినిషింగ్ లైన్ ను దాటిన జేమ్స్, ఆప్యాయంగా అతన్ని కౌగిలించుకున్నాడు. ఆపై మీడియాతో మాట్లాడిన డియాగో, పందెం ఆసాతం అతను తనకన్నా ముందే ఉన్నాడని, ఈ విజయానికి అతను అర్హుడని అన్నాడు. ఇక, పోటీలో చివరి క్షణంలో ఏం జరిగిందన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని సుమారు 81 లక్షల మందికి పైగా వీక్షించారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.