New Delhi: ఢిల్లీలో నావికాదళ మాజీ అధికారి దారుణ హత్య.. ఆర్థిక లావాదేవీలే కారణం!
- ఫ్లాట్ కోసం చెల్లించాల్సిన డబ్బుల విషయంలో గొడవ
- తుపాకితో కాల్పులు జరిపిన నిందితుడు
- నోట్లోంచి దూసుకుపోయిన తూటా
దేశ రాజధాని ఢిల్లీలో నావికాదళ మాజీ అధికారి దారుణ హత్యకు గురయ్యారు. అతి సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. నేవీ రిటైర్డ్ అధికారి అయిన బలరాజ్ దేశ్‌వాల్ (55) తన వ్యాపార భాగస్వాములతో కలిసి ద్వారకలోని సెక్టార్ 12లో ఓ అపార్ట్‌మెంట్ నిర్మించారు. ప్రదీప్ ఖోకర్ అనే వ్యక్తి అందులో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ఈ ఫ్లాట్‌కు సంబంధించి అతను ఇంకా రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉంది.
ఈ విషయంలో నిన్న అపార్ట్‌మెంట్ కార్ పార్కింగ్ ప్రదేశంలో బలరాజ్, ప్రదీప్‌ల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రదీప్ ఒక్కసారిగా తుపాకితో బలరాజ్‌పై కాల్పులు జరిపాడు. ఓ తూటా ఆయన నోట్లోంచి దూసుకుపోయింది. దీంతో కుప్పకూలిన ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.