Rajya Sabha: వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఏకమైన విపక్షాలు... కాంగ్రెస్, తృణమూల్ తో జతకట్టిన టీఆర్ఎస్
- 8 మందిపై సస్పెన్షన్ తొలగించాల్సిందే
- వాకౌట్ చేసిన కాంగ్రెస్, తృణమూల్, వామపక్షాలు
- వారి వెంటే బయటకు వెళ్లిన టీఆర్ఎస్
- సర్ది చెప్పేందుకు వెంకయ్య ప్రయత్నం
రాజ్యసభలో నేడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిత్యమూ తీవ్ర విమర్శలు చేసుకునే పార్టీలు వ్యవసాయ బిల్లులకు ఆమోదం తరువాత జరిగిన పరిణామాలతో ఏకమయ్యాయి. నిన్న రాజ్యసభ నుంచి పలు పార్టీలకు చెందిన ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేయగా, వారిపై నిషేధాన్ని ఎత్తివేయాలని పలు విపక్ష పార్టీలు ముక్తకంఠంతో నినదించాయి. వారిపై సస్పెన్షన్ ను ఎత్తివేసేంత వరకూ తాము సభకు హాజరు కాబోమని కాంగ్రెస్, తృణమూల్, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలు వాకౌట్ చేయగా, టీఆర్ఎస్ సైతం వారిని అనుసరించింది.
ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలియజేసే సభ్యుల హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు వ్యాఖ్యానించారు. సభ్యులపై వేటును తొలగించి, వారిని సభలోకి ఆహ్వానించేంత వరకూ తాము కూడా సభకు హాజరు కాబోమని స్పష్టం చేస్తూ వాకౌట్ చేశారు. కేంద్రం వ్యవసాయ బిల్లులపై పునరాలోచించాల్సిందేనని స్పష్టం చేస్తూ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడి ఎదుట నిరసన తెలుపుతూ బయటకు వెళ్లారు.
ఈ సమయంలో వెంకయ్య స్పందిస్తూ, ఏ సభ్యుడికీ తాను వ్యతిరేకం కాదని, వారి ప్రవర్తన బాగాలేకనే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. డివిజన్ ఓటింగ్ నిర్వహించేందుకు కూడా అనువైన పరిస్థితి లేకపోయింని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ముఖంపైనే రూల్ బుక్ ను విసిరేశారని, ఈ ఘటనను జాతి యావత్తూ చూసిందని అన్నారు.