Budda Venkanna: తప్పుడు సాక్షి అడ్డంగా బుక్కైంది.. వైసీపీ నేతలను కూడా బురిడీ కొట్టించింది: బుద్ధా వెంకన్న
- ఎంఓయూ చేసుకోవడానికి ఐటీ సెక్రటరీకి లోకేశ్ అనుమతి ఇచ్చారు
- సాక్షి దాన్ని రూ. 2 వేల కోట్ల అవినీతిగా మార్చింది
- వైసీపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెపుతారు
సాక్షి మీడియాపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. దొంగ వార్తలతో ఏకంగా వైకాపా నేతలనే బురిడీ కొట్టించిందని ఆయన అన్నారు. జనాలను నమ్మించాలని ప్రయత్నించిన తప్పుడు సాక్షి అడ్డంగా బుక్కైందని చెప్పారు. అదొక విషపత్రిక అనే విషయాన్ని మరోసారి నిరూపించుకుందని అన్నారు.
2017 నవంబర్ 14న కేంద్ర ఐటీ, టెలికాం మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా భారత్ నెట్ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రాల ఐటీ మంత్రులతో సమావేశాన్ని నిర్వహించాయని తెలిపారు. భారత్ నెట్ రెండవ దశ ప్రాజెక్టు ద్వారా గ్రామాలకు హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించేందుకు ఎంఓయూ చేసుకోవడానికి రాష్ట్ర ఐటీ సెక్రటరీ, ఏపీ ఫైబర్ గ్రిడ్ ఎండీలను ఆహ్వానించిందని చెప్పారు. ఆ కార్యక్రమానికి వెళ్లి ఎంఓయూ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని అప్పటి ఐటీ సెక్రటరీ విజయానంద్ నాటి మంత్రి నారా లోకేశ్ ను కోరారని తెలిపారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి లోకేశ్ ఇచ్చిన అనుమతిని సాక్షి మీడియా రూ. 2 వేల కోట్ల అవినీతిగా మార్చిందని మండిపడ్డారు.
దొంగ సాక్షిని చూసి నోరు పారేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. లేని అవినీతిని లోకేశ్ కి అంటించడం మీ తరం కాదని అన్నారు.