Talasani: ఎక్కడ ఇళ్లు కడుతున్నామో తెలుసుకుని అక్కడికి వెళ్లి చూడండి: కాంగ్రెస్ నేతలపై తలసాని వ్యాఖ్యలు
- భట్టి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్న తలసాని
- కాంగ్రెస్ వాళ్లు జాబితా చూసుకోవాలని హితవు
- హైదరాబాదులో కాంగ్రెస్ కు దిక్కులేదని వ్యాఖ్యలు
టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య డబుల్ బెడ్ రూం ఇళ్ల రగడ ఇప్పట్లో ముగిసేట్టు కనిపించడంలేదు. లక్ష ఇళ్లు వట్టిమాటేనని, డబుల్ బెడ్ రూం ఇళ్ల జాబితా అంతా తప్పులతడక అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో భట్టి మాటలు హాస్యాస్పదమని అన్నారు.
హైదరాబాదులో లక్ష ఇళ్లు నిర్మిస్తున్నది వాస్తవమని, ఆ జాబితా కాంగ్రెస్ వాళ్లకు ఇచ్చామని, వారు ఆ జాబితా చూసుకోవాలని అన్నారు. నాంపల్లిలో తాము ఇళ్లు నిర్మించింది ఒక చోట అయితే, కాంగ్రెస్ నేతలు చూసింది మరో చోట అని వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో తాము ఎక్కడ ఇళ్లు కడుతున్నామో అక్కడికి వెళ్లి చూడాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు.
కాంగ్రెస్ నేతలకు డబుల్ బెడ్ రూం ఇళ్లపై మాట్లాడే అర్హత లేదని అన్నారు. హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీకి దిక్కులేదని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసేందుకు వారికి 150 మంది అభ్యర్థులు ఉన్నారా? అంటూ ఎద్దేవా చేశారు.